హట్టి పేరుతో అమానుషం

0
49

* ఆ మూడు రోజులు ఊరి బయటే
* ప్రసవిస్తే మూడు మాసాలు..
* కమ్యూనిటీ హాలులోనే ఆశ్రమం

* నిబంధనలు ఉల్లఘిస్తే వారికి అదే శిక్ష
* దళితులకు నో ఎంట్రీ శ్రీ మడకశిరలో వింత           ఆచారాలు

 అనంతపురం ప్రతినిధి: ”రుతుస్రావం అన్నది మహిళ శరీరంలో ప్రతి నెలా జరిగే సహజమైన ప్రక్రియ. దీని గురించి బహిరంగంగా మాట్లాడటం నేరం కాదు. మరింతగా చర్చలు జరగాల్సిన అవసరముంది” అని ఒకవైపు దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కాని అనంతపురం జిల్లాలోని కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో మాత్రం ఈ పేరుతో కొన్ని గ్రామాల్లో రుతుస్రావం అయిన మహిళలను ఊరిబయట పెట్టే అనాగరిక ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ గ్రామాల్లో రుతుస్రావం అయిన మహిళలు గ్రామంలో ఉండేందుకు వీల్లేదు. ఊరిబయట ఉండాల్సిందే. ప్రసవం జరిగితే మూడు మాసాల పాటు బయట ఉండాలన్నది ఆచారం.ఈ దురాచారాన్ని రూపు మాపేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా ఫలితం లేదు. ఆచారం తప్పుతే అపచారం జరుగుతుందన్న పేరుతో మహిళలను ఊరి బయట ఉండే గుడిసెల్లోనో… ఇందుకోసం ప్రత్యేకంగా నిర్మించిన కమ్యూనిటీ భవనంలోనూ ఉండాల్సి ఉంటుంది.
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండలంలోని జి.జి.హట్టి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారు 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ గ్రామం మొత్తం ఒకే సామాజిక తరగతికి చెందిన వారుంటారు. ప్రధానంగా పశుపోషణ మీదనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ గ్రామంలో అనాదిగా అనేక వింతాచారాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు రుతుస్రావం అయితే గ్రామంలో ఉండేందుకు వీల్లేదు. గ్రామ శివార్లలో నిర్మించిన కమ్యూనిటీ హాలులో ఐదు రోజుల పాటు ఉండాలి. ఆ హాలులో కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా ఉండదు. రాత్రి సమయాల్లో లైట్లు వేస్తే ఆ నీడ బయట రహదారిలో వెళ్లే వారిపై పడుతుందని విద్యుత్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. ఇక ఐదు రోజుల తరువాత అక్కడే బహిరంగ ప్రదేశాల్లో స్నానం చేసి మహిళలు ఇంటికి రావాల్సి ఉంటుంది. ఇక ప్రసవిస్తే ఊరికి కిలోమీటరు దూరంలో పొలాల్లో గుడిసె వేసుకుని బాలింత, అప్పుడేపుట్టిన బిడ్డ ఉండాలి. ఎవరైనా వారికి సహాయంగా వెళితే వారు కూడా రెండు మాసాల వరకు గ్రామంలోకి రావడానికి వీల్లేదు. వర్షం వచ్చినా, ఎండవున్నా వారికి ఆ బాధలు తప్పవు. రోజూ ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లినా వారు కూడా దూరం నుంచి అక్కడ ఉంచేసి రావాల్సిందే. ఇది అక్కడికి కట్టుబాటుతో కూడిన ఆచారం. ఇది గ్రామస్తులకే కాదు… ఆ గ్రామంలో పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయునియులైనా పాటించాల్సిందే. ఈ ఆచారం పాటించకపోతే అపరాచం జరుగుతుందన్నది ఆ గ్రామస్తుల నమ్మకం. ఇది ఈ ఒక్క గ్రామానికి చెందిన ఆచారం కాదు.ఈ సరిహద్దుల్లో హట్టి అనే పేరుతోనున్న ప్రతి గ్రామంలోనూ ఉంది. దీన్ని రూపుమాపేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నించి విఫలం చెందాయి.

దళితులకు ప్రవేశం లేదు
ఈ గ్రామాల్లోకి దళితులకు ఎలాంటి ప్రవేశం ఉండదు. అది ఎమ్మెల్యే అయినా, కలెక్టరు అయినాగాని గ్రామంలోకి రావడానికి వీలుండదు. ఏదైనా ఉంటే ఊరి ప్రవేశం వద్ద నుంచే మాట్లాడి వెళ్లాలి. ఇక అంతేకాదు… చిత్త మాసంలో మూడు రోజులపాటు పండుగ జరుగుతుంది. ఈ పండుగ పూర్తయ్యే వరకు ఇతర గ్రామాలకు చెందిన వారెవనూ ఊళ్లో అడుగుపెట్టడానికి వీల్లేదు. పండుగ తంతు ముగిసిన తరువాత మాత్రం ఇతరులు రావడానికి అనుమతి ఉంటుంది. ఇదొకటే కాదు. గ్రామంలో కోడి పెంపకంగాని, కోడి కోసి తినడం కూడా ఉండదు. ఏదైనా ఉంటే మేక, పొట్టేలు మాత్రమే తినడానికి అనుమతి ఉంటుంది.

ఈ ఆచారం వద్దని చెప్పినా వినలేదు
రుతుస్రావం అయితే ఊరి బయట ఉండరాదని స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేశాయి. నేను కూడా ఆర్డీటీ సంస్థలో సిబిటిగా పనిచేశాను. ఆ సమయంలో వారి ద్వారా చెప్పారు. కాని ఆనాదిగా వస్తున్న ఆచారం తప్పితే గ్రామానికి అరిష్టమని పెద్దలెవరూ ఒప్పుకోలేదు. దీంతో చేసేదిలేక మేము ఆ ఆచారాన్ని పాటిస్తున్నాం. ఐదు రోజులు మాకు కష్టాలు తప్పవు. ఏమి చేయగలం, కష్టమైనా పాటించాల్సిందే.
గ్రామస్తురాలు, కమలమ్మ

బిడ్డ చనిపోయినా ఆరుబయటే.. బాలింత, తిక్కమ్మ
తిమ్మక్కకు నెల రోజుల క్రితం బిడ్డ జన్మించి చనిపోయింది. పక్కురిలోనున్న ఆసుపత్రిలో రూ.1.60 లక్షలు ఖర్చు పెట్టినా బిడ్డ ప్రాణం దక్కలేదు. అక్కడి నుంచి వచ్చాక ఇంటికెళ్లేందుకు వీల్లేదు. ఆచారం ప్రకారం రెండు మాసాలు ఆరుబయట వేసిన గుడిసెలోనే ఉండాలన్నది ఊరి నియమం. ఈ ప్రకారమే నేను ఆరు బయటే గుడిసెలో ఉంటున్నాను. ఆరోగ్యమైదేనా బాగోలేకపోయినా పక్కురి నుంచి డాక్టరును పిలిపించి వైద్యమందిస్తారు. అంతే తప్ప ఇంట్లోకి పోవడానికి మాత్రం వీల్లేదు.

Courtesy Prajasakti

Leave a Reply