మహిళ సజీవ దహనం…

0
73

– లైంగికదాడి… హత్య!.. నారాయణపేట జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్‌ నగర్‌ ‘దిశ’ ఘటన మరువక ముందే అదే తరహాలో ఘోరం జరిగింది. 35ఏండ్ల వయస్సు గల మహిళపై సామూహికంగా లైంగికదాడి చేసిన దుండగులు, అనంతరం పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన నారాయణ పేట జిల్లా మక్తల్‌ సమీపంలోని సంగంబండ ప్రాజెక్టు వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పూర్తిగా కాలిపోయిన మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టడం పోలీసులకు కష్టంగా మారింది. మహిళ మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి 100మీటర్ల దూరంలో మద్యం

సీసాలు, పగిలిన గాజు ముక్కలను పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని మక్తల్‌ ఎస్‌ఐ రాములు తెలిపారు. కాగా, మృతురాలు వడ్వాట్‌ గ్రామానికి చెందిన మహిళగా స్థానికులు అనుమానిస్తున్నారు. మక్తల్‌లో ఓ కల్లు దుకాణం వద్ద బఠాణీ, గుడ్లు అమ్ముతుంటారనీ, గత రెండు రోజులుగా ఆమె కనిపించడంలేదని తెలిపారు. ఆమె కుమారుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు వివరాలు వెల్లడించలేదు.

Courtesy Nava Telangana

Leave a Reply