కోకాపేటలో మహిళ మృతదేహం..

0
26
  • అత్యాచారం చేసి, హత్య చేసినట్లు అనుమానం
  • 15 రోజుల తర్వాత వెలుగులోకి..!

హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌ : నార్సింగ్‌ పరిధి కోకాపేట పోచారం గుట్ట పక్కన సర్వేనెంబర్‌ 126లోని నిర్మానుష్య ప్రాంతంలో పూర్తిగా కుళ్లిన స్థితిలో మహిళ శవం దొరికింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం, హత్య చేసి మృతదేహాన్ని తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేటలోని సెవెన్‌హిల్స్‌ పోచారం గుట్టల్లో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు.

మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. 15 రోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉంటుందని, ఆమె వయసు 40 ఏళ్లలోపు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమెను ఎవరు..? ఎక్కడ..?, ఎందుకు చంపారు..? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఎలాంటి ఫిర్యాదుగానీ, మిస్సింగ్‌ కేసు కానీ నమోదుకాలేని ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు. ఇటీవల నగరంలో, రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్‌ కేసులను పరిశీలిస్తామన్నారు. అనుమానాస్పద మృతి/హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆనవాళ్లను బట్టి..
మృతురాలి ఎడమ చేతికి గాజు (గోటు), కుడి చేతికి నల్లని దారం, రెండు కాళ్లకు పట్టాగొలుసులు, చెవులకు మాటీలు ఉన్నాయి. ఘటనా స్థలంలో పింక్‌ కలర్‌ స్వెటర్‌, కాలి చెప్పును పోలీసులు గుర్తించారు. ఆనవాళ్లను బట్టి ఎవరైనా గుర్తుపడితే నార్సింగ్‌ పోలీసులను సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ పేర్కొన్నారు.

జాలర్ల వలకు చిక్కిన మరో మృతదేహం
చేపల కోసం వేసిన వలలో చిక్కిన ఓ మహిళ మృతదేహాన్ని జాలర్లు బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఆదివారం శామీర్‌పేట మండలం పొన్నాల్‌ ఎర్రకుంట చెరువులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేపలు పట్టేందుకు ఎర్రకుంట చెరువులో జాలర్లు వల వేసి బయటకు లాగుతుండగా వివస్త్రంగా ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. తొలుత ఏదో వింత జీవిగా భావించి భయపడ్డ జాలర్లు తర్వాత మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. దుండగులు ఆమెను కట్టిపడేసి హత్య చేసి చెరువులో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply