వివాహితను ఇంట్లోకి లాక్కెళ్లి వివస్త్రను చేసి సామూహిక అత్యాచారం, హత్య

0
34
  • మద్యం మత్తులో ఇద్దరు కూలీల ఘాతుకం
  • నల్లగొండ జిల్లాలో ఘోరం.. నిందితుల అరెస్టు! 

నల్లగొండ క్రైం : ఓ వివాహిత.. 54 ఏళ్లుంటాయి! ఊర్లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతోంది! అప్పటికే పూటుగా తాగి ఆ మత్తులో ఉన్న ఇద్దరు వ్యవసాయ కూలీలు ఆమెను చూశారు. ఆమెను పట్టుకొని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి వివస్త్రను చేసి.. సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను దారుణంగా హత్యచేశారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో పట్టపగలు ఈ ఘోరం జరిగింది. నిందితులను అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు బక్కతట్ల లింగయ్య, పుల్లయ్యగా గుర్తించారు. నల్లగొండ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి ఘటన వివరాలను వెల్లడించారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మీద వెళుతున్న వివాహితను లింగయ్య, పుల్లయ్య అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి ఆమెను లింగయ్య ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై హత్యాచారం జరిపిన తర్వాత.. ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. దారిలో హతురాలి మరిది కనిపిస్తే.. మీ వదిన రోడ్డు మీద పడివుందని చెప్పారు. చెప్పిన చోటుకొచ్చి అతడు చూస్తే ఆమె కనిపించకపోవడంతో   లింగయ్య ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ తల, ఒంటిపై గాయాలతో విగతజీవిగా పడివున్న తన వదినను చూశాడు. అతడిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులొచ్చారు.  హతురాలి ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు గాజులు, మూడు తులాల పుస్తెలతాడు అక్కడే పడి ఉండటంతో దొంగతనం కోసం కాకుండా మద్యం మత్తులోనే  వారు ఈ ఘోరానికి పాల్పడ్డారనే అంచనాకొచ్చారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితులకు నేర ప్రవృత్తి ఉందని, వారిపై గతంలో కేసులున్నట్లు సమాచారం.

Courtesy Andhrajyothi

Leave a Reply