మహిళపై లైంగికదాడి, హత్య

0
347

కుటుంబసభ్యులు, గ్రామస్తుల రాస్తారోకో.. 
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

సిర్పూర్(యు) కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలం, రామునాయతాండలో గుర్తు తెలియని దుండగులు మహిళపై లైంగికదాడి చేసి.. ఆపై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం వెలుగుజూసింది. తండాలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబీకులు, గ్రామస్తులు రాస్తారోకో చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్తాన్ఎల్లాపూరు చెందిన టేకు లక్ష్మి రెండేండ్లుగా జైనూర్ మండల కేంద్రంలో నివసిస్తోంది. భర్త గోపితో కలిసి తలవెంట్రుకలకు బెలూన్లు, వంటింటి సామాగ్రి అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఆదివారం గోపి లక్ష్మిని లింగాపూర్ మండలం ఎల్లాపటార్

గ్రామంలో విడిచి పెట్టాక, అతను జాముల్ ధరి గ్రామానికి తలవెంట్రుకలు సేకరించేందుకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనం సమయంలో రామునాయక్ తండాకు రమ్మని లక్ష్మికి చెప్పాడు. మధ్యాహ్నం రామునాయక్ తండా చౌరస్తా వద్ద భార్య కోసం ఎదురు చూశాడు. ఆమె రాకపోవడంతో ఎల్లాపటారు వెళ్లి వెతికాడు. అక్కడా లేకపోవడంతో ఆటోలో జైనూర్లోనూ గాలించాడు. ఫలితం లేకపోవడంతో లింగాపూర్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎప్స్ వెంకటేష్ ఆధ్వర్యంలో రామునాయకతండా, ఎల్లాపటార్, గోపాలపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. మర్నాడు సోమవారం ఉదయం రామునాయక్ తాండ శివారులో ఓ మహిళ శవాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. వివస్త్రగా, బలమైన కత్తిపోట్లతో ఉన్న ఆ మృతదేహం లక్ష్మీదిగా గుర్తించారు. గోపికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, జైనూర్ సీఐ సురేష్ చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో నిందితులను పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. ఎల్లాపట్టార్ గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మిపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసినట్టు భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు డీఎస్పీ భరోసా ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని లక్ష్మి బంధువులు, రామునాయక్ తండా గ్రామస్తులు మృతదేహంతో లింగాపూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. దీంతో కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ సత్యనారాయణ అక్కడికి చేరుకొని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఎ వెంకటేష్ తెలిపారు.

Courtesy Nava telagana…

Leave a Reply