* గృహ హింసకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో మహిళలు కదంతొక్కారు. గృహహింసకు పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆదివారం పారిస్ వీధుల్లోకి చేరుకొని మహిళలు భారీ ర్యాలీలు తీశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పురుషుల చేతుల్లో తాము అణచివేతకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. మహిళలపై జరుగుతున్న లైంగికదాడులను అరికట్టాలని, గృహహింసకు గురవుతున్న మహిళలకు న్యాయం, రక్షణ కల్పించాలని ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఐరాస జారీ చేసిన ఆదేశాలను మాక్రన్ సర్కార్ తుంగలో తొక్కిందని నిరసనకారులు విమర్శించారు. గృహ హింసకు పాల్పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల వద్ద ఎలాంటి మారణాయుధాలున్నా తక్షణమే పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గృహ హింస నిరోధక చట్టాలను పకడ్భందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూరోపియన్ యూనియన్‌లోని ( ఈయూ) 28 సభ్యదేశాల్లో 42వేల మంది మహిళలు గృహ హింసకు గురయ్యారని 2014లో ఓ ఎన్జీవో సంస్థ పేర్కొంది. ఈయూ సభ్యదేశాల్లో ఫ్రాన్స్‌లోనే గృహ హింస ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయని ఆ సంస్థ తెలిపింది. ఈ ఏడాది గృహహింస కారణంగా ఫ్రాన్స్‌లో 130 మంది మహిళలు మృతిచెందారు. మాక్రన్ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. గృహ హింసకు పాల్పడ్డవారిని చట్టపరంగా శిక్షించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు.
Courtesy Prajasakti…