వస్తోంది.. ఫ్యావిపిరవిర్‌

0
263

విపణిలోకి తేబోతున్న గ్లెన్‌మార్క్‌
తొలిసారి దేశీయ అనుమతి
బాధితులు త్వరగా కోలుకునే అవకాశం
త్వరలో స్ట్రైడ్స్‌ ఫార్మాకు కూడా…?
కొవిడ్‌- 19 చికిత్సలో వినియోగం

హైదరాబాద్‌: కొవిడ్‌- 19 మహమ్మారి బారిన పడిన రోగులు కోలుకునేందుకు వీలు కల్పించే యాంటీ-వైరల్‌ ఔషధమైన ‘ఫ్యావిపిరవిర్‌’ ను తయారుచేసి విక్రయించటానికి అనుమతి పొందిన మొట్టమొదటి సంస్థగా గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌కు గుర్తింపు లభించింది. ‘వేగవంతమైన అనుమతుల ప్రక్రియ’లో భాగంగా గ్లెన్‌మార్క్‌ ఔషధానికి డీసీజీఐ (డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి మంజూరు చేసింది. ఈ ఔషధాన్ని ‘ఫ్యాబిఫ్లూ’ అనే బ్రాండ్‌ పేరుతో వెంటనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా ప్రకటించింది.

కొవిడ్‌- 19 వ్యాధి ఒక మాదిరి నుంచి మధ్య స్థాయిలో ఉన్న రోగులకు ఈ ఔషధాన్ని ఇచ్చిన పక్షంలో నాలుగు అయిదు రోజుల్లో ‘వైరల్‌ లోడ్‌’ తగ్గి, రోగి కోలుకునే అవకాశం వస్తుందని కంపెనీ పేర్కొంది. ‘ఫ్యావిపిరవిర్‌’ ఔషధం ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రేడియంట్‌)ను తన సొంత పరిశోధన-అభివృద్ధి పరిజ్ఞానంతో ఆవిష్కరించినట్లు గ్లెన్‌మార్క్‌ వివరించింది. మనదేశంలో ఎంతో వేగంగా కొవిడ్‌- 19 కేసులు విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మీద ఎంతో ఒత్తిడి ఉందని, ‘ఫ్యావిపిరవిర్‌’ ఔషధంతో ఈ ఒత్తిడి కొంతమేరకు తగ్గుతుందని గ్లెన్‌మార్క్‌ సీఎండీ గ్లెన్‌ సల్దానా పేర్కొన్నారు.

ఈ ఔషధాన్ని జపాన్‌లో ‘అవిగన్‌’ అనే బ్రాండెడ్‌ ఔషధంగా 2014 నుంచి ఉపయోగిస్తున్నారు. ఇన్‌ఫ్లుయంజా వ్యాధి నుంచి కోలుకోవటానికి బాగా పనిచేస్తుందని జపాన్‌ వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఫ్యూజీఫిల్మ్‌ గ్రూపునకు చెందిన టయోమా కెమికల్‌ కంపెనీ ‘అవిగన్‌’ ఔషధాన్ని తయారు చేస్తోంది. ‘ఫ్యావిపిరవిర్‌’ తయారీకి దేశీయంగా అనుమతి పొందిన తొలి సంస్థ గ్లెన్‌మార్క్‌ కాగా, ఇదే కోవలో స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌కు సైతం త్వరలో అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే స్ట్రైడ్స్‌ ఫార్మా ఈ ఔషధం తయారీకి అనుమతి కోరుతూ డీసీజీఐ వద్ద దరఖాస్తు చేసింది. అందువల్ల ఈ సంస్థకు కూడా అనుమతి రాబోతోందని సంబంధిత వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ముంబయిలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐసీటీ) ఫ్యావిపిరవిర్‌ తయారీ పరిజ్ఞానాన్ని తన ప్రయోగశాలలో ఆవిష్కరించింది. దీంతో ఈ సాంకేతిక పరిజ్ఞానం దేశీయ కంపెనీలకు సులువుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడుతోంది. దీనికి తోడు దేశీయ ఫార్మా కంపెనీలు సొంతంగా కూడా ఈ ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆప్టిమస్‌ ఫార్మా, ఎవరెస్ట్‌ ఆర్గానిక్స్‌… తదితర కంపెనీలు కూడా రేసులో ఉన్నాయి.

  • మందుల చీటీ (వైద్యుల ప్రిస్క్రిప్షన్‌) ఉన్న వారికి ఒక్కో టాబ్లెట్‌ను రూ.103 ధరకు విక్రయిస్తారు.
  • ఇది నోటి ద్వారా తీసుకునే ఔషధం.
  • తొలిరోజు 1800 ఎంజీ డోసు రెండుసార్లు, ఆ తర్వాత రెండు వారాల పాటు రోజుకు 800 ఎంజీ డోసు చొప్పున వాడాల్సి ఉంటుందని కంపెనీ సిఫార్సు చేస్తోంది.

Courtesy Eenadu

Leave a Reply