మన ‘బంగారం’ నిఖత్‌ ‘జై’రీన్‌

0
175
  • చరిత్ర సృష్టించిన తెలంగాణ యువతి
  • ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం

కుటుంబ నేపథ్యం సాధారణమే అయినా.. సాధన చేసింది ఓ చిన్న పట్టణంలోనే అయినా.. తాను ఎంచుకున్న ఆట విషయంలో సమాజం నుంచి ఎన్నో అభ్యంతరాలు ఎదురైనా.. కెరీర్లో ఎదుగుతున్న దశలో అడ్డంకులు ఎదురైనా.. సాధించాలన్న సంకల్పం ఉంటే.. ఇవేవీ ఆపలేవని చాటి చెబుతూ ప్రపంచ వేదికపై సత్తా చాటింది నిఖత్‌.

అమ్మాయిలకు ఆటలా.. అందులోనూ బాక్సింగా.. శరీరం తట్టుకుంటుందా? ఆ అమ్మాయి చిన్నతనంలో ఆ కుటుంబానికి ఎదురైన ప్రశ్న ఇది! ”మన కట్టుబాట్లేంటి.. ఇంటిపట్టున ఉండకుండా ఈ ఆటలేంటి..” ”మగరాయుడిలా ఇలాంటి ఆటలాడితే.. పంచ్‌లకు ముఖం పచ్చడైతే పెళ్లెవరు చేసుకుంటారు?” ”ఛాంపియన్లు పెద్ద నగరాల నుంచే వస్తారండీ.. చిన్న పట్టణాల్లో సౌకర్యాలుండవు. సరైన గైడెన్స్‌ ఉండదు” ”ఆటల్లో రాజకీయాలు సహజం. కొన్నిసార్లు అన్యాయం కూడా జరగొచ్చు. వాటి గురించి ప్రశ్నించకూడదు” ..ఇలా కెరీర్లో ఎన్నో ప్రశ్నలు, అభ్యంతరాలు, షరతులు..! వీటన్నింటినీ దాటుకుని.. ఇప్పుడు ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబడింది తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌. ఇప్పుడు తనొక ప్రపంచ ఛాంపియన్‌! ఆటల్లో అడుగు వేయించిన తండ్రికి.. అండగా నిలిచిన కుటుంబానికి.. మెలకువలు నేర్పి ప్రోత్సాహం అందించిన కోచ్‌లకు.. ప్రపంచ బాక్సింగ్‌ టైటిల్‌ రూపంలో గొప్ప బహుమతి ఇచ్చింది నిఖత్‌ జరీన్‌.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిష్ఠాత్మక ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఒక్కొక్కరిని మట్టి కరిపిస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చిన నిఖత్‌.. గురువారం హోరాహోరీగా సాగిన 52 కేజీల విభాగం ఫైనల్లో 5-0తో జిట్‌పాంగ్‌ జటామస్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది. స్వర్ణం మీద తన పేరే రాసిపెట్టినట్లు.. ఓటమిని అంగీకరించేదే లేదన్నట్లు మెరుపు పంచ్‌లతో ప్రత్యర్థిపై సివంగిలా విరుచుకుపడ్డ జరీన్‌.. రింగ్‌లో విజయనాదం చేసింది. మేరీకోమ్‌ పోటీ పడే విభాగంలోనే ఆడడం వల్ల ఒక స్థాయికి మించి ఎదగలేకపోయిన నిఖత్‌.. ఇప్పుడు ఆ విభాగంలోనే స్వర్ణం నెగ్గి ఈ దిగ్గజ క్రీడాకారిణికి సరైన వారసురాలిని తానే అని చాటింది.

  • మన జరీన్‌.. బాక్సింగ్‌ క్వీన్‌
  • నిఖత్‌.. తెలంగాణ తాఖత్‌
  • బాక్సింగ్‌ ఛాంపియన్‌కు సీఎం కేసీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో నిజామాబాద్‌కు చెందిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ విశ్వ విజేతగా నిలవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. విశ్వ క్రీడావేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన నిఖత్‌..తెలంగాణ తాఖత్‌(శక్తి) అని ఆయన అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్‌ బాక్సింగ్‌ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని, తెలంగాణలోని ఊరూరా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని తెలిపారు. నిఖత్‌ జరీన్‌ కొత్త చరిత్ర సృష్టించారని, రాష్ట్ర క్రీడా ఆణిముత్యంగా ఆమె నిరూపించుకున్నారని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభినందించారు. నిఖత్‌ తెలంగాణ సత్తాచాటారని మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సత్యవతిరాథోడ్‌, సబితారెడ్డిలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ఆమెకు అభినందనలు తెలిపారు. నిఖత్‌ చరిత్రాత్మక విజయంతో అందరికీ ప్రేరణగా నిలిచారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌, యువతకు ఆమె స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు అభినందించారు. నిఖత్‌ విజయంపై రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థలో ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు.

Courtesy Eenadu

Leave a Reply