కవులు, రచయితలు మౌనం వీడాలి

0
245
కవులు, రచయితలు మౌనం వీడాలి
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: కె.శివారెడ్డి.. సృజనాత్మక రచనలు పెరగాలి: కె.శ్రీనివాస్‌
ఉరి, ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా తీర్మానాలు

హైదరాబాద్‌ సిటీ: దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ తరుణంలో రచయితలు, కవులు మౌనాన్ని వీడాలని ప్రఖ్యాత కవి, సరస్వతీ సమ్మాన్‌ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి పిలుపునిచ్చారు. ధిక్కార స్వరం బతికే ఉందనడానికి విప్లవ రచయితల సంఘం (విరసం) ఆచరణే నిదర్శనం అని అన్నారు. సామాజిక, రాజకీయ కార్యాచరణకు దగ్గరగా ఉన్న సాహితీకారులు ఎవరికివాళ్లు ప్రశ్నించుకునేందుకు విరసం 50 వసంతాల సభ ఒక మంచి సందర్భమని వ్యాఖ్యానించారు. విరసం ఆవిర్భవించి 50ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన 27వ మహాసభల్లో భాగంగా ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘ఫాసిస్ట్‌ సందర్భంలో రచన’ అంశంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివారెడ్డి ప్రసంగించారు. విరసం తీర్చిదిద్దిన కవిగా తాను గర్విస్తున్నానని, విరసంతోనే ఉన్నానని, జీవితాంతం విరసంతోనే ఉంటానని అన్నారు.

నిరసన గళాలను నొక్కివేస్తున్న స్థితిలో సాంస్కృతిక రంగంలో పనిచేసేవాళ్లు తమ కార్యాచరణ గురించి మాట్లాడేందుకు ఇదే మంచి సందర్భమని సూచించారు. అనంతరం ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ ప్రసంగించారు. ప్రధానంగా విరసంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘‘ప్రభుత్వాలు నిర్బంధాన్ని ప్రయోగించిన ప్రతిసారీ దాన్ని ఫాసిజం అంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా నిజమైన ఫాసిజం గురించి మాట్లాడుకుంటున్నాం’’ అని కె. శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు.

ఫాసిజం అంటే ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల ఆమోదంతోనే చేయగలగడం, అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడమేనని వివరించారు. ప్రజల మధ్య ప్రేమ, ఐక్యతలను పెంపొందించే విధంగా సృజనాత్మక రచనలు మరింత పెరగాలని ఆకాంక్షించారు. కాగా మోదీ క్రూరమైన విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం అవసరమని ముగింపు సభలో పాల్గొన్న ప్రముఖ హక్కుల నేత ఆచార్య హరగోపాల్‌, ప్రఖ్యాత రచయిత జి. కల్యాణరావు తదితరులు ఉద్ఘాటించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఏను రద్దు చేయాలని, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ముస్లింలపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని, అత్యాచార ఘటనల్లో నిందితులను ఉరితీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను, అత్యాచార ఘటనల్లో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని ఖండిస్తూ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించారు.

నోమ్‌ ఛామ్‌స్కీ సందేశం
విరసం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు, భాషావేత్త నోమ్‌ ఛామ్‌స్కీ అభినందన సందేశాన్ని పంపారు. నేడు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్న హిందూత్వను ఎదుర్కోడానికి విరసం చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకోవడం సంతోషాన్ని కలిగించిందని లేఖలో తెలిపారు. పెద్ద ఎత్తున సామాజిక సంస్కరణలు తీసుకురాగల ప్రజా ఉద్యమం, భారత సమాజానికి ఎంతో అవసరమని సూచించారు. ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు విరసం సభ ఒక వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. మోదీ క్రూరమైన, విధ్వంసకర విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించేందుకు మహాసభలు సహాయపడతాయన్నారు. ‘యూఎన్‌ కొయలేషన్‌ టూ ఫ్రీ ప్రొఫెసర్‌ సాయిబాబా సంస్థ’ నుంచి విరసం మహాసభలకు అభినందన సందేశం పంపారు.

(Courtesy Andhrajyothi)

Leave a Reply