కంగనకు ‘వై’ కేటగిరి భద్రత

0
202
  • 10 మంది కమాండోలతో రక్షణ: కేంద్రం
  • దావూద్‌కీ భద్రత కల్పిస్తారు: శివసేన

న్యూఢిల్లీ/సిమ్లా : బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 10 మంది కమెండోలు షిప్టులవారీగా ఆమెకు రక్షణగా ఉంటారని వెల్లడించింది. సుశాంత్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌ పెద్దలు, ముంబై పోలీసులపై కంగన తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముుంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. దీనిపై అధికారపార్టీ శివసేన తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం తన సొంతరాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న కంగన 9వ తేదీన ముంబైకి రావాలని యోచిస్తున్న తరుణంలో ఆమెకు కేంద్రం ‘వై’ కేటగిరి భద్రత కల్పించడం గమనార్హం. తనకు భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కంగన ట్వీట్‌ చేసింది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావూద్‌ ఇబ్రహీం మాట్లాడితే అతడికీ కేంద్రం భద్రత కల్పిస్తుందని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే కేంద్రం ముఖ్య ఉద్దేశ మన్నారు. వారికి ఉత్తరప్రదేశ్‌లో జరిగే అత్యాచారాలు కనిపించవని మండిపడ్డారు.

నా ఆఫీసును కూలుస్తారట: కంగన
బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. ముంబై అధికారులు ఖర్‌ ప్రాంతం లో ఉన్న తన కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పారు. మంగళవారం తన ఆఫీసును కూల్చివేస్తామంటూ బృహన్ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు సమాచారమందించారని ఆమె ఓ ట్వీట్‌లో తెలిపారు. తన ఆఫీసును నిబంధనలకు లోబడే నిర్మించానని.. దానికి సంబంధించి అన్ని అనుమతులూ తన వద్ద ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అయినా సరే అధికారులు తనను వేధిస్తున్నారని చెప్పారు. అంతేకాక తన ఇరుగు పొరుగువారిని కూడా అధికారులు వేధిస్తున్నారని కంగన ఆరోపించారు. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ కంగన ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారపార్టీ శివసేనకు ఆమెకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కొందరికి కృతజ్ఞత ఉండదు: ఉద్ధవ్‌
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. కంగనరనౌత్‌పై పరోక్ష విమర్శలు చేశారు. కొంతమంది వ్యక్తులు  తమకు జీవనోపాధిని కల్పించిన ముంబై, మహారాష్ట్ర పట్ల ఎంతో కృతజ్ఞత చూపిస్తారని, కానీ మరికొంతమందికి మాత్రం ఎటువంటి కృతజ్ఞత ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

Courtesy Andhrajyothi

Leave a Reply