వలస పాలనలో ఆర్థిక దోపిడీ

0
226

దాదా భాయ్ నౌరోజీ (1825–1917) తొలితరం సామాజిక, రాజకీయ నాయకులలో ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో అగ్రగణ్యుడు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుప్రసిద్ధుడైన నౌరోజీ వలసపాలనలో భారత్ గురవుతున్న ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తిన తొలి భారతీయుడు. బ్రిటన్‌కు తరలిపోతున్న నిధుల గురించి ఆయన తన ‘పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో విపులంగా రాశారు. 1870 జూలై 27న లండన్‌లోని సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ సమావేశంలో ఆయన చదివిన ఒక పరిశోధనా పత్రంలోని కొన్ని భాగాలివి:

భారత్ ప్రస్తుతం తన అవసరాలు అన్నిటినీ సొంతంగా తీర్చుకోగల స్థితిలో ఉందా? తొలుత భారత్ అవసరాలు ఏమిటో చూద్దాం. ఆరోగ్యంగా వర్ధిల్లేందుకు యావత్ ప్రజలకు తగినంత తిండి, కట్టుకునేందుకు బట్ట, ఉండేందుకు గృహాలు మొదటి అవసరాలు. ఆ తరువాత వివిధ సామాజిక బాధ్యతలు, సాంఘిక పరిస్థితుల నుంచి తలెత్తిన సామాజిక ఆకాంక్షలను తగు స్థాయి తీర్చుకోవడానికి అవసరమైన వాటిని సమకూర్చడం. మూడోది ప్రతి వ్యక్తీ తగు స్థాయిలో తన ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేసుకోవడం. ఏటా జాతి సంపదలో కొంత భాగాన్ని ఆకస్మిక ఆపదలను తట్టుకోవడానికిగాను ఆదా చేసుకోవడం. నాల్గవది కొత్త ప్రజోపయోగ నిర్మాణాలు, ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచుకోవడం. ఐదవది విదేశీ పాలనకు మూల్యంగా చెల్లించేందుకు అవసరమైన నిధులు. ఈ కారణంగా భారత్ నుంచి ఏటా 10,000,000 పౌండ్లు ఇంగ్లాండ్‌కు తరలిపోతున్నాయి,

వీటిలో మొదటి నాలుగూ అన్ని దేశాలకూ సామాన్యమైనవి. ఐదవది మాత్రమే భారత్‌కు ప్రత్యేకమైనది. భారతీయులు ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణాలలో అదొకటి. విదేశీ పాలన మనుగడ పూర్తిగా ఈ అసాధారణ పరిస్థితి మీదనే ఆధారపడి ఉంది. ఒక నాగరిక జాతి తన సాధారణ అవసరాలను తీర్చుకునే విధంగా ఉత్పత్తి చేసుకోగలగడంతో పాటు, విదేశీ పాలనకు చెల్లించాల్సిన మూల్యాన్ని సైతం సమకూర్చుకునేలా ఆ దేశానికి దోహదం చేయలేని పక్షంలో విదేశీ ప్రభుత్వం కూడా తనను తాను నిర్వహించుకోలేదు. ఈ విషయంలో విదేశీ ప్రభుత్వం విఫలమయితే అది సంబంధిత వలస దేశానికి మోయలేని భారంగా పరిణమిస్తుంది. ఆకలి దప్పులు, పేదరికం ప్రబలిపోతాయి. విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు అనివార్యమవుతాయి. మా బ్రిటిష్ పాలకులు తమ పాలనను, అటు తమ స్వదేశానికి, ఇటు భారత్‌కు ప్రయోజనకరంగా శాశ్వతం చేసుకోదలుచుకుంటే భారత్ వెన్ను విరుస్తున్న సమస్యపై శ్రద్ధ చూపాలి. భారత్ ప్రస్తుతం తన సాధారణ అవసరాలు అన్నిటినీ తీర్చుకోగలగడంతో పాటు, విదేశీ పాలనకు మూల్యంగా ఏటా కోటి రూపాయలను చెల్లించగల స్థితిలో ఉందా అని బ్రిటిష్ పాలకులు తమకు తాము ప్రశ్నించుకోవాలి. తన అవసరాలను తీర్చుకునే విధంగా భారత్ ఉత్పత్తి చేయలేనప్పుడు, భారత ప్రజల అవసరాలను తీర్చలేనందుకు ఆర్థిక మంత్రి, వైస్రాయిని తప్పుపట్టడం వల్ల ప్రయోజనం లేదు. శూన్యం నుంచి వారు ఏమీ ఉత్పత్తి చేయలేరు కదా.

1858 నుంచి 1967 దాకా యునైటెడ్ కింగ్‌డమ్ దిగుమతుల విలువ 2,640,000,000 పౌండ్లు. ఎగుమతుల విలువ 2,110,000,000 పౌండ్లు. ఈ దిగుమతుల విలువలో భారత్ రాజకీయ చెల్లింపులు 100,000,000 పౌండ్లు కూడా ఉంటాయి. ఎగుమతుల విలువ నుంచి 80,000,000 పౌండ్లు మినహాయించుకోవల్సి ఉంది. ఈ మొత్తం ఆ పది సంవత్సరాల కాలంలో భారత్ కోసం చేసిన వివిధ రుణాలు. మొత్తం మీద వాణిజ్యేతర దిగుమతుల విలువ కంటే వాణిజ్యేతర ఎగుమతుల విలువే అధికం. బ్రిటన్ సంపన్న దేశం. దాని రాబడి 70,000,000 పౌండ్లు మళ్లీ పన్ను చెల్లింపుదారులకే చేరుతుంది. దీనికి అదనంగా భారత్ నుంచి ఏటా జరిగే రాజకీయ చెల్లింపులు 10,000,000 పౌండ్లు కూడా బ్రిటిష్ ప్రజలకే వెళతాయి. మరి పేద దేశమైన భారత్ రాబడి 50,000,000 దాని పన్ను చెల్లింపుదారులకు చేరదు. చేరకపోగా ఆ ఆదాయంలో 10,000,000 పౌండ్లు దేశం నుంచి తరలిపోతున్నాయి.

Courtesy Andhrajyothi

Leave a Reply