
ఎస్ బ్యాంకు సంక్షోభం బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా ప్రయివేట్ బ్యాంకింగ్ వ్యవస్థలోని సంక్షోభాన్ని మరొకసారి బయటపెట్టింది. ఈ మధ్యనే పీఎంపీ బ్యాంకు సంక్షోభం వల్ల డిపాజిటర్లు పడ్డ ఇబ్బందులను మరిచిపోకముందే ఎస్ బ్యాంక్ సంక్షోభం రావడం జరిగింది. పెట్టుబడిదారులకు నూతన ఆర్థిక విధానాలు కలిగిస్తున్న లబ్దిని ప్రయివేట్ బ్యాంకుల సంక్షోభాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఆర్బీఐ సెబీ లాంటి నియంత్రణ సంస్థల వైఫల్యాలనూ ఈ ప్రయివేట్ బ్యాంకుల సంక్షోభాలు తెలియజేస్తున్నాయి. ఇటీవల ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ మేము నిజాయితీ పరులకు కోసం నిలబడతాం, ఆశ్రిత పెట్టుబడిదారులతో కఠినంగా వ్యవహరిస్తాం అని చెప్పారు. కానీ ఎస్ బ్యాంక్ సంక్షోభం ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ సూత్రాలను పక్కనపెట్టి కార్పొరేట్లు ఎలా లాభపడతారు అనేది తెలియజేసింది.
ఎస్ బ్యాంకు పరిణామాలు మనకు కొన్నాళ్ళ కింద ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన విషయాలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ రెండు బ్యాంకులలో చందా కొచ్చర్, రాణా కపూర్‌లు ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు. బ్యాంకు వ్యవహారాలను పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకున్నారు. దీని వల్ల కార్పొరేట్ పరిపాలన పద్ధతులు అమలు లేకుండా పోయాయి. అధిపతులుగా ఉన్న వ్యక్తులు బ్యాంకు ప్రయోజనాల కన్నా తమ వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడంతో బ్యాంకులు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి.
ఎస్ బ్యాంక్ 2004లో స్థాపించబడింది. 2015 కల్లా ప్రయివేట్ రంగంలోని పెద్ద బ్యాంకుల్లో ఎస్ బ్యాంకు ఒకటిగా ఎదిగింది. 2020 మార్చి 5న ఎస్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆర్బీఐ తెలిపింది. తాము ఇచ్చిన రుణాలను ఎస్ బ్యాంకు రాబట్టుకోలేక పోతుందని, పెట్టుబడులను పెంచుకోలేకపోతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. పరిపాలన పద్ధతులలో కూడా లోపాలున్నాయని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకును కాపాడుకోవాలంటే కొన్ని తక్షణ చర్యలు అవసరమని రిజర్వు బ్యాంకు తెలిపింది. ఇందులో భాగంగా బ్యాంకు ఖాతాదారులందరూ ఒక నెల వరకు అంటే ఏప్రిల్ 3 వరకు 50000 రూపాయల కన్నా ఎక్కువ సొమ్మును బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవడంపై నిషేధం విధించింది. రిజర్వు బ్యాంకు యొక్క ఈ ప్రకటన ఒక్కసారిగా బ్యాంకు ఖాతాదారులలో అయోమయాన్ని, భయాన్ని సృష్టించింది.
ఎస్ బ్యాంకు పునర్వ్యవస్థీకరణ కోసం రిజర్వ్ బ్యాంకు ఇతర చర్యలను కూడా చేపట్టింది. దీని ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బ్యాంకులో 49శాతం వాటాను కొనుగోలు చేస్తుంది. ఎస్ బ్యాంక్ యొక్క మూలధన పెట్టుబడిని 800 కోట్ల నుంచి 5000 కోట్లకు పెంచుతారు. కాబట్టి ఎస్‌బీఐ సుమారు 2450 కోట్లను ఎస్ బ్యాంక్‌లో పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. అయితే ఎస్ బ్యాంక్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని అంచనా వేస్తున్నారు. ఎస్‌బీఐ తన 49శాతం వాటాగా సుమారు 9800 కోట్ల రూపాయలను బ్యాంకులో పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. ఎస్‌బీఐ తన 26శాతం వాటాను మూడేండ్ల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. ఇలా మరొకసారి ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ప్రయివేట్ బ్యాంకును రక్షించనున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి తాము ఎస్ బ్యాంకులో వాటాలు కొంటున్నామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. పునర్వ్యవస్థీకరించినాక బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగులకు కనీసం ఒక సంవత్సరం వరకు ఉద్యోగ భద్రత, వేతనాల రక్షణ ఉంటుంది. ఎస్ బ్యాంకు సంబంధించిన అన్ని శాఖలూ ఆఫీసులు యథావిధిగా కొనసాగుతాయి. ఖాతాదారుల డిపాజిట్లు, బాండ్‌లు రక్షింపబడతాయి. అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీల టయర్-1 (ఏటీ1) బాండ్‌లు మాత్రం శాశ్వతంగా రద్దు చేయబడతాయి. ఇది దాదాపుగా 11 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఎస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో ఎస్ బ్యాంక్ పనితీరుపై కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి ఎస్ బ్యాంకు సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వమే కారణమన్నారు. యూపీఏ ప్రభుత్వం కూడా ప్రయివేటు బ్యాంకులకు అనుకూలంగానే పనిచేసింది. ఇందులో ఏ మాత్రమూ సందేహం లేదు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 2014 తర్వాత ఎస్ బ్యాంకులో జరిగిన పరిణామాలు ఏమిటి? ఎస్ బ్యాంకు పని తీరుపై 2015లోనే యూబీఎస్ అనే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ అభ్యంతరాలను తెలియజేసింది. బ్యాంక్ ఆస్తుల నాణ్యత గురించి అనుమానం వ్యక్తం చేసింది. తన నెట్ వర్త్ కన్నా ఎక్కువగా అప్పులను బ్యాంకు ఇచ్చిందని అదికూడా అప్పులు తీర్చలేని కంపెనీలకు బ్యాంకు రుణాలు ఇచ్చిందని యూబీఎస్ తెలియజేసింది. ఇచ్చిన రుణాలలో 25శాతం కన్నా ఎక్కువగా ఎంబిఎఫ్‌సి కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, నిర్మాణ రంగంలోని కంపెనీలకు రుణాలుగా ఇచ్చింది. ఈ మూడు రంగాల్లో కూడా గత మూడు సంవత్సరాలుగా ఎలాంటి వృద్ధి లేదు. దీనివల్ల మొండి బకాయిలు ఎస్ బ్యాంకులో విపరీతంగా పెరిగాయి. అయితే ఈ మొండి బకాయిలను కూడా తమ అకౌంట్లో చూపించకుండా బ్యాంకు జాగ్రత్త పడింది. మొండి బకాయిలను తన రుణాల్లో ఏడు శాతంగా చూపించడం జరిగింది. కానీ నిజానికది 30శాతంగా ఉంది. 2018-19 సంవత్సరంలో 3277 కోట్ల రూపాయల మొండి బకాయిలను ఎస్ బ్యాంకు దాచి పెట్టింది. మరోవైపు ఖాతాదారులు కూడా తమ డిపాజిట్ సొమ్మును విత్ డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో దాదాపు 18000 కోట్ల రూపాయలను ఖాతాదారులు ఎస్ బ్యాంకు నుంచి ఉపసంహరించుకున్నారు. పెరుగుతున్న మొండి బకాయిలు, అలాగే పెరుగుతున్న ఖాతాదారుల నిష్క్రమణ బ్యాంక్ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఎస్ బ్యాంకు ఇచ్చిన రుణాలు కూడా 2014 నుంచి భారీగా పెరిగాయి. 2014లో 55,000కోట్ల రూపాయలుగా ఉన్న బ్యాంకు రుణాలు 2019 సంవత్సరం కల్లా 2,41,000 కోట్ల రూపాయలకు పెరిగాయి. రుణాలలో దాదాపు 400శాతం పెరుగుదల గత ఐదేండ్లలో ఉన్నది. గత రెండేండ్లలో 1,09,000 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చారు. మార్చి 2017లో 1,32,000 కోట్ల రూపాయలుగా ఉన్న బ్యాంకు లోను మార్చి 2019కి 2,41,000రూపాయలకు పెరిగింది. రెండేండ్లలోనే లోను ఖాతా 80 శాతం పెరిగింది. బ్యాంకు రుణాలు ఎవరికి ఇచ్చింది? ఏ కార్పొరేటు సంస్థలు బ్యాంకు రుణ వితరణ వల్ల లాభపడ్డారు? ఆర్థిక వ్యవస్థలో రుణాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్ సంస్థలు జంకుతుంటే ఇంత పెద్ద మొత్తంలో ఎవరు రుణాలు తీసుకున్నారు? అలాగే ఇతర బ్యాంకులు రుణ వితరణ చేయలేక సతమతమై పోతుంటే ఒక ఎస్ బ్యాంక్ మాత్రం తన లోను ఖాతాను ఎలా పెంచుకోగలిగింది? దీన్ని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. వైఫల్యం చెందిన కార్పొరేట్ సంస్థలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని ఎస్ బ్యాంక్ దగ్గర రుణాలు తీసుకొని వాటిని తాము ఇదివరకు తీసుకున్న అప్పులను చెల్లించడానికి ఉపయోగించుకున్నాయని స్పష్టమైపోయింది. సహకార బ్యాంకులు కూడా తాము తీసుకున్న రుణాలను చెల్లించడానికే ఎస్ బ్యాంక్ ద్వారా అప్పులు తీసుకున్నాయి. ఇదంతా ఒక పోంజి స్కీమ్ లాగా పని చేసింది. నోట్ల రద్దు తర్వాత ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలలో 80శాతం వరకు ఎస్ బ్యాంకు ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల ద్వారా ఇచ్చినవే.
ప్రస్తుత ఆర్థిక మందగమనానికి కారణం బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీ, రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులేనని కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రహ్మణ్యం చెప్పారు. వీటిని ఆయన ఫోర్ బ్యాలెన్స్ క్రైసిస్‌గా పేర్కొన్నారు. ఆర్బీఐ గాని, సెబి గాని, కేంద్ర ప్రభుత్వం గానీ ఈ సంక్షోభాలను పసిగట్టలేకపోయాయి.
నియంత్రణ వ్యవస్థ వైఫల్యాలను ఇది సూచిస్తున్నది. ఐఎల్‌ఎఫ్‌ఎస్, డిహెచ్‌ఎఫ్‌ఎల్ సంక్షోభాలను మన నియంత్రణ సంస్థలు ముందుగా తెలుసుకో లేకపోయాయి. పంజాబ్, మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి 5శాతం కన్నా తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును మరింత క్షీణింప చేస్తాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎస్ బ్యాంకు వ్యవస్థాపకులు రాణా కపూర్‌ను మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్టు చేసింది. కపూర్ భార్య ఆయన ముగ్గురు కుమార్తెలు విచారణను ఎదుర్కొంటున్నారు. ఎస్ బ్యాంక్ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలకు బదులుగా కపూర్ కుటుంబానికి సంబంధం ఉన్న షల్ కంపెనీలకు ‘నాకిది నీకది’ పద్ధతిలో పెట్టుబడులు వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి. డిహెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీకి ఇచ్చిన 600 కోట్ల రుణానికి సంబంధించిన విషయాలను ఈడీ విచారిస్తున్నది. కంపెనీస్ యాక్ట్, సెబి నిబంధనలు, ఆర్బీఐ నియంత్రణలను తప్పించుకొని ఎస్ బ్యాంక్ ప్రమోటర్లు తమ ఖాతాదారులను, ప్రజలను మోసం చేశారు. అయితే బ్యాంకులు దివాలా తీస్తే అది ఆ కంపెనీ ప్రమోటర్‌ని మాత్రమే నష్టపరచదు. కంపెనీలో పని చేస్తున్న సాధారణ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారు. ఖాతాదారులు తాము దాచుకున్న సొమ్ము నష్టపోతారు. బ్యాంకుతో సంబంధం ఉన్న ఇతర కంపెనీలు, పరిశ్రమలు ఇబ్బందుల్లో పడతాయి. ఈ కంపెనీల మీద ఆధారపడ్డ అగ్జిలరి కంపెనీలు మూత పడే అవకాశాలు పెరుగుతాయి. ఎన్నో జీవనాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం – ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణల పర్వం కొనసాగుతుంది. కానీ మళ్లీ మళ్లీ వస్తున్న ఈ సంక్షోభాలకు కారణం ఏమిటి అనేది ఎవరూ లోతుగా విశ్లేషించరు. రోగ లక్షణాలను నయం చేయడానికి తాత్కాలికమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది కానీ అసలు రోగాన్ని సమూలంగా నిర్మూలించే దానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు. ఎస్ బ్యాంక్ సంక్షోభం ప్రయివేటు, పబ్లిక్ రంగ సంస్థల పనితీరుపై చర్చను ముందుకు తెచ్చింది. ప్రయివేట్ కంపెనీలు విఫలమవడం పబ్లిక్ రంగ సంస్థలు వాటిని కాపాడుకోవడం మనం చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ సంక్షోభాలైనా, బ్యాంకులు, పరిశ్రమలు ఇతర ఆర్థిక సంస్థలు మూతపడుతున్న వేళ వాటిని ఆదుకుంటున్నది ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ లాంటి పబ్లిక్ రంగంలో ఉన్న ప్రముఖ ఆర్థిక సంస్థలే.
ప్రయివేట్ బ్యాంకులు ఆకర్షణీయమైన ప్రతిపాదనలతో, పబ్లిక్ రంగ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీని ఇస్తామన్నా హామీలతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు సేకరించడంలో విజయం సాధిస్తున్నాయి.
ఇలా సేకరించిన ప్రజల డబ్బును తమ సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రభుత్వాలు నియంత్రణ సంస్థలు వారికి అండగా ఉండటంతో వారు చేస్తున్న మోసాలు బయటకు రాలేకపోతున్నాయి. ప్రజలను ముంచేసి కార్పొరేట్ సంస్థల, ప్రమోటర్ల కుటుంబాల ప్రయోజనాలను మాత్రమే అవి కాపాడుతున్నాయి. ఎస్ బ్యాంక్ సంక్షోభం దీనిని స్పష్టంగా తెలియజేసింది. పబ్లిక్ రంగ సంస్థలను, బ్యాంకులను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం బ్యాంకుల విలీనం పేరుతో వాటిని ప్రయివేటీకరించే ప్రయత్నం చేస్తున్నది. ఎస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచంలోనే గొప్ప బీమా సంస్థగా ఉన్న ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించడం ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుందో ప్రజలు అలోచించాలి. ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకోవాలి. ఆర్థిక రంగంలోని నియంత్రణ సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలి. నియంత్రణ సంస్థలు పారదర్శకంగా పని చేయాలి. ఈ సంస్థల కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. అప్పుడే ఎస్ బ్యాంకు లాంటి సంక్షోభాలను నివారించగలుగుతాం.
Courtesy Nava Telangana