ఏడుగురిపై లుక్‌ఔట్‌ నోటీసు

0
321

యెస్‌ బ్యాంక్‌ కుంభకోణంలో సీబీఐ జారీ
ఏడుగురిలో రాణా కపూర్‌, ఆయన కుటుంబ సభ్యులు

న్యూఢిల్లీ: యెస్‌ బ్యాంక్‌ కుంభకోణంతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిపై సీబీఐ సోమవారం లుక్‌ఔట్‌ నోటీసును జారీ చేసింది. వీరిలో యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ నేపథ్యంలో వీరు దేశం విడిచి వెళ్లడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. కపూర్‌తోపాటు ఆయన భార్య బిందు, కుమార్తెలు రోషిణి, రాఖీ, రాధాలతోపాటు డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ప్రమోటర్‌ కపిల్‌ వాద్వాన్‌,ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌ ప్రమోటర్‌ ధీరజ్‌ వాద్వాన్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈడీ కూడా ఎల్‌ఓసీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కపూర్‌ కూతురు రోషిణి లండన్‌ వెళ్తుండగా ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్‌ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.

7 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
రూ.600 కోట్లకు సంబంధించిన యెస్‌ బ్యాంక్‌ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐ సోమవారం ముంబైలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ నుంచి ఈ ముడుపులు రాణా కపూర్‌ కుటుంబానికి అందినట్టుగా ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌లో ఐదు కంపెనీలు, ఏడుగురు వ్యక్తుల పేర్లను నమోదు చేసింది. వీరిలో రాణా కపూర్‌, ఆయన భార్య బిందు, ఆయన ముగ్గురు కూతుళ్లు (రోషిణి, రాఖీ, రాధా), కపిల్‌ వాద్వాన్‌, ధీరజ్‌ రాజేష్‌ కుమార్‌, డీహెచ్‌ఎ్‌ఫఎల్‌కు సంబంధం ఉన్న కంపెనీ ఉన్నాయి. వీరిని సీబీఐ నిందితులుగా పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు.

18,110 కోట్ల డిపాజిట్ల ఉపసంహరణ
యెస్‌ బ్యాంక్‌పై కస్టమర్లకు విశ్వాసం సన్నగిల్లుతోంది. వారి డిపాజిట్లు తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. 2019 మార్చి చివరినాటికి యెస్‌ బ్యాంక్‌ డిపాజిట్ల మొత్తం రూ.2,27,610 కోట్లుంది. జూన్‌ చివరినాటికి (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం)  ఈ మొత్తం ఏకంగా రూ.2,25,902 కోట్లకు తగ్గాయి. రెండో త్రైమాసికం చివరినాటికి (సెప్టెంబరు) రూ.2,09,497 కోట్లకు తగ్గిపోయాయి. మొత్తంగా 2019 మార్చి నుంచి సెప్టెంబరు వరకు రూ.18,110 కోట్ల డిపాజిట్లు తగ్గిపోయాయి. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను బ్యాంక్‌ వెల్లడించని ఫలితంగా డిపాజిట్లు ఇంకా ఎంత తగ్గాయన్న వివరాలు వెల్లడి కాలేదు. బ్యాంకులో ఏదో సమస్య ఉందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో తమ డిపాజిట్లను ఉపసంహరించుకున్నట్టు పలువురు ఖాతాదారులు చెబుతున్నారు.

భారీ రుణాలపై ఈడీ కన్ను
మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా యెస్‌ బ్యాంక్‌ కార్పొరేట్‌ కంపెనీలకు జారీ చేసిన భారీ రుణాలపై ఈడీ దృష్టిసారిస్తోంది. డీహెచ్‌ఎ్‌ఫఎల్‌కు ఇచ్చిన రుణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర కంపెనీలకు ఇచ్చిన రుణాలపై దర్యాప్తు చేయనున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా సోమవారం యెస్‌బ్యాంక్‌ సీఈఓ రవ్‌నీత్‌ గిల్‌ను ఈడీ తన ముంబైలోని కార్యాలయంలో ప్రశ్నించినట్టు సమాచారం. కపూర్‌ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేయడానికి ఏ నిధులను వినియోగించారన్న కోణంలో కూడా ఈడీ దర్యాప్తు సాగుతోంది. డజను డొల్ల కంపెనీలు, రూ.2,000 కోట్ల కపూర్‌ కుటుంబ పెట్టుబడులు, రూ.4,500 కోట్ల లావాదేవీలను కూడా ఈడీ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఈ వారంలో మారటోరియం ఎత్తివేయవచ్చు
యెస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారటోరియాన్ని శనివారం ఎత్తివేసే అవకాశం ఉండవచ్చని బ్యాంకు అడ్మినిస్ర్టేటర్‌ ప్రశాంత్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మారటోరియం ఎత్తివేయడం వల్ల ఖాతాదారులు తమ సొమ్మును మరింత ఎక్కువగా తీసుకోవడానికి లేదా బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. శనివారంనాడు డిసెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసే పనిలో ఉన్నట్టు ఆయన చెప్పారు. ఆర్థిక ఫలితాల ద్వారా బ్యాంకు స్థితిపై ఒక స్పష్టత వస్తుందన్నారు.

బ్యాంకు పుస్తకాలను థర్డ్‌ పార్టీ ద్వారా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ప్రతికూలంగా సమాధానమిచ్చారు. అలాంటి అవసరం లేదన్నారు.  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో యెస్‌ బ్యాంక్‌ను విలీనం చేయడం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విలీనం చేయడం కన్నా స్వతంత్రంగా నడిచేలా మద్దతు ఇవ్వడం బాగుంటుందని ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఎస్‌బీఐలో విలీనం జరగవచ్చన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.

Courtesy Andhrajyothi

Leave a Reply