విదేశీ మదుపుదారుల కోసమే యస్ బ్యాంకు టేకోవర్

0
273

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యస్ బ్యాంకును పునరుద్ధరించేందుకు కేంద్రం సిద్ధమైందని ఆరోపించారు.

హైదరాబాద్: దివాళా తీసిన యస్ బ్యాంకును స్వాధీనం చేసుకుని ప్రభుత్వ నిధులతో దాన్ని పునరుద్దరించేందుకు ప్రయత్నం చేయడం కేవలం విదేశీ మదుపరుల మెప్పు పొందేందుకేనని మేధావులు అభిప్రాయపడ్డారు. ‘యస్ బ్యాంకు పతనం-పర్యవసానాలు’ అంశంపై శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చర్చాగోష్టి నిర్వహించారు. ఎస్వీకే ట్రస్టీ జి రఘుపాల్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కెవియస్ఎన్ రాజు మాట్లాడుతూ.. రిజర్వు బ్యాంకు ప్రకటించిన పునరుద్ధరణ పథకంలో ఉద్యోగ భద్రత, డిపాజిట్ దారుల సొమ్ము భద్రతకు సంబంధించిన ప్రస్తావనలు లేవని వెల్లడించారు. రెగ్యులేలరీ(నియంత్రణ) వ్యవస్థలే యస్ బ్యాంకు దివాళాకు కారణమని అభిప్రాయపడ్డారు.

ఏ బ్యాంకు అయినా తమ వద్ద ఉన్న నిధులకు లోబడి అప్పులు ఇస్తుందని, కానీ యస్ బ్యాంకు తన వద్ద ఉన్న సొమ్ముకు మించి అప్పులు ఇచ్చిందన్నారు. ఓ ప్రైవేటు బ్యాంకు అదనంగా మార్కెట్ నుంచి లక్ష కోట్ల రూపాయలు రుణాలు సమీకరిస్తుంటే రిజర్వు బ్యాంకు చూస్తూ ఎలా ఊరుకుందో ప్రభుత్వానికే తెలియాలన్నారు. యస్ బ్యాంకు వాటాదారుల్లో 40 మంది విదేశీ మదుపరులేనని.. ఇది దివాళా తీస్తే  ఖాతాదారులు, డిపాజిట్ దారులతో పాటు నష్టపోయేది వీరేనని వివరించారు. విదేశీ మదుపరులు నష్టపోతే అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పోతుందని, విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఖాతాదారులు ప్రయోజనాలు ఫణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకును కాపాడేందుకు ప్రయత్నం చేస్తోందని అభిప్రాయపడ్డారు.

సామాజిక విశ్లేషకులు కొండూరి వీరయ్య మాట్లాడుతూ.. భారత దేశంలో గత వందేళ్లలో ప్రైవేటు బ్యాంకులు సాగించే మోసాల్లో ఏ మాత్రం మార్పు రాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 45 ఆధారంగా బ్యాంకును టేకోవర్ చేయడం అంటే తాను ఇష్టం వచ్చినట్టు షేరు ధర, మూల ధనం నిష్పత్తి వంటివి నిర్ణయించే వెసులుబాటు ఉంటుందని గుర్తు చేశారు. సంస్కరణలు మొదలైన తర్వాత దివాళా తీసిన ప్రైవేటు బ్యాంకులకు, సంస్కరణలకు ముందు దివాళా తీసిన ప్రైవేటు బ్యాంకులకు స్వభావంలో తేడా ఉందని వీరయ్య అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు కంపెనీలు అంత నైపుణ్యం కలిగినవైతే ఎందుకు దివాళా తీస్తున్నాయన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న కుంభకోణాలను, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే యస్ బ్యాంకును పునరుద్ధరించేందుకు కేంద్రం సిద్ధమైందని ఆరోపించారు. రానున్న కాలంలో బ్యాంకు ఖాతాదారుల సొమ్ముకు రక్షణలేని పరిస్థితులు తలెత్తుతాయని, ఇప్పటికే ఖాతాదారుల సొమ్ముపై ఇచ్చే వడ్డీని మూడు శాతానికి తగ్గిస్తూ స్టేట్ బ్యాంకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని వమ్ముచేసి ఈ సొమ్మును కూడా స్టాక్ మార్కెట్ వైపు మళ్లించడమే లక్ష్యంగా కేంద్రం ఆర్థిక విధానాలు రచిస్తోందని చెప్పారు. చర్చాగోష్టిలో ఎస్వీకే కార్యదర్శి ఎస్ వినయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి టి సాగర్, సీనియర్ రైతు నాయకులు బొంతల చంద్రారెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఎం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply