– రిలయన్స్ ఇన్‌ఫ్రాకు యస్ బ్యాంక్ నోటీసులు
– రూ.2,892 కోట్ల రుణాల రికవరీకి చర్యలు
ముంబయి : అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న అప్పులు చెల్లించడంలో విఫలం కావడంతో ఆయన ప్రధాన కార్యాలయాన్ని జప్తు చేసుకోవాలని యస్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. రుణాల రికవరీలో భాగంగా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన కార్యాలయం శాంతక్రూజ్ సహా దక్షిణ ముంబయిలోని మరో రెండు కార్యాల యాలను స్వాధీన పరచుకునేందుకు వీలుగా యస్ బ్యాంక్ నోటీసులు ఇచ్చిందని టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఇచ్చిన రూ.2,892 కోట్ల రుణాల రికవరీ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు యస్ బ్యాంక్ నోటీసులో పేర్కొంది. ఇందులో భాగంగానే నాగిన్ మహల్‌లోని రెండు ఫ్లోర్లను స్వాధీనం చేసుకుని వేలం వేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యస్ బ్యాంక్ దాదాపుగా అనీల్ అంబానీ కంపెనీలకు రూ.12,000 కోట్ల మేర రుణాలు జారీ చేసింది. గత రెండు దశాబ్దాల నుంచి అంబానీ గ్రూపు పెద్ద మొత్తంలో వ్యాపారాల విస్తరణ చేపట్టడానికి చేసిన ప్రయత్నాల్లో భారీగా అప్పులు చేసింది. కాగా ఆయా వ్యాపారాలు నగదు ప్రవాహాన్ని పెంచడంలో విఫలం కావడంతో రుణాలు తిరిగి చెల్లించలేకపోయింది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్చన్ ఆఫ్ ఫైనాన్సీయల్ అసెట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లో భాగంగా రిలయన్స్‌కు యస్ బ్యాంక్ నోటీలసులు జారీ చేసింది. 60 రోజుల గడువుతో మే 5లోగా రుణాలు చెల్లించాలని ఆదేశించింది. లేనిచో ఆస్తులను జప్తు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
Courtesy Nava Telangana