- ప్రేమించడం లేదని యువతిపై దాడి
- నల్గొండలో దారుణం
నల్గొండ : ప్రేమించడం లేదని కక్ష కట్టాడు. స్నేహితులతో ఆమెను పిలిపించి…కత్తితో ఏకంగా పదిసార్లు పొడిచాడు. అతని కత్తివేటుకు అమ్మాయి పెదవులు చీలిపోయాయి. పలుచోట్ల గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను స్నేహితులే ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. నల్గొండ జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటు చేసుకుంది. ఒకటో పట్టణ సీఐ రౌతు గోపి, స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు..నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ప్రాంతానికి చెందిన యువతి (21) స్థానిక ఎన్‌జీ కళాశాలలో ఇటీవలే బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఇదే కళాశాలలో నల్గొండకు చెందిన రోహిత్ (21) బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలం నుంచి తనను ప్రేమించాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. తనకు ఇష్టం లేదని ఆమె తిరస్కరించడంతో పాటు ఇటీవల దూరం పెడుతోంది. దాంతో రోహిత్ దుర్బుద్ధితో తన స్నేహితుడిని సంప్రదించాడు.అతను ఒక స్నేహితురాలి ద్వారా యువతిని మంగళవారం పట్టణంలోని ఒక పార్కుకు రప్పించాడు. అప్పటికే అక్కడ రోహిత్ ఉండటంతో కంగారుపడ్డ యువతి వెనక్కి వెళదామని ప్రయత్నించినా… కొద్ది సేపు మాట్లాడుదామని రోహిత్ బలవంతం చేశాడు. మాట్లాడుతున్న క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో పదిసార్లు యువతిని పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అక్కడే ఉన్న యువకుడి స్నేహితులు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు, వైద్యులు వెల్లడించారు.
పథకం ప్రకారమే..
యువతిపై పథకం ప్రకారమే దాడి చేశానని పోలీసులకు రోహిత్ వెల్లడించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.గతంలో రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని నిందితుడు పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. దాడి విషయాన్ని ముందుగానే ఊహించి బాధితురాలు షీటీంకు గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాడికి కారణాలపై విచారణ చేస్తున్నారు. గతంలో నిందితుడితో యువతి సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు సైతం బయటకు రావడంతో ఇద్దరి మధ్య ఏ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి? దాడి విషయం రోహిత్ స్నేహితుడికి ముందే తెలుసా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.